ఎంపీలకు ఎయిర్ ఇండియా షాక్.. ఉచిత టికెట్లు బంద్
ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలుకావడంతో ఎంపీలకు ఉచిత విమాన టికెట్లు బంద్ అయ్యాయి. ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా ప్రభుత్వరంగ సంస్థగా ఉండటం వల్ల ఎంపీలకు ప్రోటోకాల్ అమలు చేసేవారు. ఇకమీదట ఆ సదుపాయం ఉండదు. ఎంపీలు డబ్బు పెట్టి విమాన టికెట్లు కొనాలని విడుదలైన రాజ్యసభ సచివాలయ బులెటిన్ సభ్యులకు సూచించింది. పార్లమెంటు సభ్యులకు వ్యక్తిగతంగా 34 విమాన టికెట్లు, వారి జీవిత భాగస్వామికి మరో 8 టికెట్లు గతంలో ఉచితంగా ఇచ్చేవారు. వారి కొనుగోలుకు పార్లమెంటు ఉభయసభల సచివాలయాలు ఎక్స్ఛేంజ్ ఆర్డ్ర్ జారీ చేసేవి. ఆ ఉత్తర్వులు చూసి డబ్బు పెట్టకుండానే ఎంపీలు ఎయిర్ ఇండియా టికెట్లు కొనుగోలు చేయడానికి వీలుండేది. ఇప్పుడు ఆ విధానాన్ని రద్దు చేశారు. రాజ్యసభ, లోక్సభ సచివాలయాలు ఇప్పటికే జారీ చేసిన ఎక్స్ఛేంజ్ ఆర్డర్లను అనుసరించి టికెట్లు కొని ఉంటే అందుకు సంబందించిన టిఏ క్లెయిమ్లు చేసుకోవచ్చు. కొత్త నిబంధన ఎంపీలకు కొంత ఇబ్బందికరమేనని వారి వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు.
ఉత్తర భారతదేశం, ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చాలామంది ఎంపీలకు మార్కెట్ రేటుకు టికెట్లు కొనేంత ఆర్థికస్తోమత ఉండదని, అలాంటివారు నగదు పెట్టి కొనడం ఇబ్బంది అవుతుందన్నారు. టికెట్ల మొత్తాన్ని తదుపరి దశలో రీఎంబర్స్ చేసినప్పటికీ, ఆ బిల్లుల క్లియరెన్సుకు సమయం పడుతుంది కాబట్టి, ఇబ్బందికరంగా మారుతుందని తెలిపారు. ఇప్పటికే ఎంపీ ల్యాడ్స్ను సైతం కేంద్రం తాత్కాలికంగా స్తంభింపజేసింది. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీలకు 10 సీట్ల కోటాతోపాటు కేంద్రమంత్రి విచక్షణాధికారం కింద మరికొన్ని సీట్లు మంజరు చేసే వారు. ఇప్పుడు ఆ అదనపు కోటా రద్దు చేశారు.













