సీఎం పదవికి రాజీనామా అనంతరం.. స్టాలిన్ ఎమోషనల్ పోస్ట్!
దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన డీఎంకే (DMK) పార్టీకి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు (MK Stalin) తమిళనాడు ఓటర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమి అనూహ్యంగా, ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న నేపథ్యంలో.. స్టాలిన్ తన ముఖ్యమంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేశారు. ద్రవిడ కూటమి ఓడిపోవడంతో ఆయన నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకుని.. రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (Rajendra Vishwanath Arlekar)కు తన రాజీనామా లేఖను లాంఛనంగా సమర్పించారు. స్టాలిన్ రాజీనామాను తక్షణమే ఆమోదించిన గవర్నర్.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరేంత వరకు ‘ఆపద్ధర్మ ముఖ్యమంత్రి’గా (Caretaker CM) కొనసాగాలని ఆయనను కోరారు.
ఇవి కూడా చదవండి
ప్రజా తీర్పుకు తలవంచుతున్నా..
రాజీనామా అనంతరం ఎంకే స్టాలిన్ (MK Stalin) సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన, భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. తమిళనాడు ఓటర్లు ఇచ్చిన ప్రజాస్వామ్య తీర్పును తాను పూర్తిగా గౌరవిస్తున్నానని, తలవంచి అంగీకరిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ఘనవిజయం సాధించిన విజేతలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. “అధికారం కోల్పోయినంత మాత్రాన మా పోరాటం ఏమాత్రం ఆగదు. రాబోయే రోజుల్లో శాసనసభలో డీఎంకే పార్టీ ఒక నిర్మాణాత్మకమైన, ప్రభావవంతమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి అలుపెరగని పోరాటం చేస్తుంది” అని ఆయన (MK Stalin) తన క్యాడర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
నా మనస్సాక్షి ప్రకారమే నడుచుకున్నా..
గత ఐదేళ్ల తన పాలనను గుర్తుచేసుకుంటూ స్టాలిన్ (MK Stalin) ఉద్వేగానికి లోనయ్యారు. “మా ప్రభుత్వం దళితులు, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలను నిస్వార్థంగా అమలు చేసింది. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం. గడిచిన ఐదేళ్ల మా పాలనా రికార్డును, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి మాత్రమే మేము ధైర్యంగా ప్రజలను ఓట్లు అడిగాము. ఎన్నికల సమయంలో మాకు ఓటు వేయని వారితో సహా.. రాష్ట్ర ప్రజలందరి సంక్షేమం కోసమే నేను ప్రభుత్వాన్ని నడిపాను తప్ప ఏనాడూ పక్షపాతం చూపలేదు. ప్రతి నిర్ణయంలోనూ నా మనస్సాక్షి ప్రకారమే నిజాయితీగా వ్యవహరించాను” అని ఆయన (MK Stalin) పేర్కొన్నారు.
ఓటమి ఎదురైన ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ పార్టీని నమ్మి ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటరుకు, అలాగే క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమించిన డీఎంకే కార్యకర్తలకు స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల బరిలో తమకు వెన్నంటి నిలిచిన సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమి భాగస్వామ్య పక్షాలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మొత్తానికి స్టాలిన్ రాజీనామాతో తమిళనాడు రాజకీయాల్లో పటిష్టమైన డీఎంకే శకానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. భవిష్యత్తులో స్టాలిన్ (MK Stalin) ప్రతిపక్ష నేతగా ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి








