భారత్ మరో అరుదైన ఘనత : మోదీ
సూర్యుడిని అధ్యయనం చేసేందుకు నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య-ఎల్1 తన గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరుకుంది. ఈ స్పేస్క్రాప్ట్ను తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన కీలక విన్యాసం ఫలించింది. భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి దీన్ని పంపించారు. ఇక్కడి నుంచి ఇది నిరంతరం సూర్యుడిని పర్యవేక్షిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. దేశ తొలి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య` ఎల్1 తన గమ్యస్థానాన్ని చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రల్లో మన శాస్త్రవేత్తల అంకితభావానికి ఇది నిదర్శనం. ఈ అద్భుత విజయం సాధించిన శాస్త్రవేత్తలకు అభినందనలు. మానావళి ప్రయోజనాల కోసం శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్త శిఖరాలకు చేరుకునే మన ప్రయాణం కొనసాగుతుంది అని మోదీ తెలిపారు.













