చిన్నారులకు సోకుతుందన్న ఆధారల్లేవ్ : ఊపిరి పోసిన గులేరియా ప్రకటన

కరోనా రెండో వేవ్ తర్వాత మూడో వేవ్ చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని, ముఖ్యంగా పిల్లలపై చాలా ప్రభావం చూపిస్తోందని వార్తలొస్తున్నాయి. దీంతో తల్లిదండ్రుల్లో, ప్రభుత్వాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ప్రభుత్వాలు కూడా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడంలో ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాయి. తల్లిదండ్రులకు తగు చైతన్యాన్ని కూడా కల్పించనున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ డైరెక్టర్ ఊపిరిపోసే ప్రకటన చేశారు. మూడో వేవ్ కరోనాతో పిల్లలకు ముప్పు పొంచి ఉందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తేల్చి చెప్పారు. మూడో దశ పిల్లలపై ప్రత్యేకంగా ప్రభావం చూపుతుందన్న విషయంలో స్పష్టత లేదని కోవిడ్ నివారణా కమిటీ సభ్యులు వెల్లడించారని, కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ఆధారంగా సీరో ప్రివలెన్స్ రేటు కూడా అదే విషయాన్ని వెల్లడించిందని గులేరియా గుర్తు చేశారు. మూడో వేవ్‌లో పిల్లలకు అధికంగా కరోనా వైరస్ సోకుతుందని రుజువు చేసే ఆధారాలేవని లేవని ప్రకటించారు. థర్డ్‌వేవ్‌పై తల్లిదండ్రుల్లో తీవ్రమైన ఆందోళన నెలకొన్న మాట వాస్తవమేనని, అయితే మరీ భయపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. రెండో దశలోనూ కొంత మంది చిన్నారులు కరోనా బారినపడ్డారని, వారిలో చిన్నపాటి లక్షణాలే కనిపించాయని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ పెద్దగా ప్రభావం చూపదనే తాము భావిస్తున్నామని గులేరియా అభిప్రాయపడ్డారు.