జిన్ పింగ్ నోట అనూహ్య మాట… అవును నిజమే

ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన చైనా గత కొంతకాలంగా డీలా పడింది. కొవిడ్ అధ్యాయం ముగిసిన తర్వాత నుంచి తమ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోందని ఆ దేశ అగ్రనాయకులు ఇప్పటికే వెల్లడించారు. కానీ, దేశాధినేత షీ జిన్పింగ్ మాత్రం ఇప్పటి వరకు దీనిపై మౌనంగా ఉన్నారు. తాజాగా ఈ అంశంపై స్పందించిన జిన్పింగ్ ఆర్థిక సవాళ్ల మాట నిజమేనంటూ అంగీకరించడం గమనార్హం. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలనుద్దేశించి జిన్పింగ్ ప్రసంగించారు. ఇందులో ఆయన చైనా ఆర్థిక పరిస్థితులను నేరుగా ప్రస్తావించారు. దేశంలోని వాణిజ్య, వ్యాపారాలు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయని, నిరుద్యోగులు ఉపాధి వేటలో ఇబ్బందులు పడుతున్నారని అంగీకరించారు. 2013 నుంచి ప్రతి ఏటా జిన్పింగ్ నూతన సంవత్సరం ప్రసంగం చేస్తున్నారు. అయితే అందులో ఆయన ఆర్థిక సవాళ్ల గురించి ప్రస్తావించడం ఇదే తొలిసారి.











































































