డబ్ల్యూహెచ్‌వో ఆరోపణలపై స్పందించిన చైనా
కరోనా మూలాల్ని కనుగొనేందుకు సిద్ధమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందం చైనాలోకి ప్రవేశించేందుకు అనుమతులు జారీ చేయలేదన్న ఆరోపణలపై ఆ దేశం స్పందించింది. దీనిపై డబ్ల్యూహెచ్‌వోతో సంప్రదింపులు జరుపుతున్నామని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ తెలిపారు. నిపుణుల రాకకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. అయితే, కరోనా కట్టడి నేపథ్యంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. నిపుణుల బృందం కార్యకలాపాలు సజావుగా సాగాలంటే కొన్ని ప్రక్రియల్ని పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. దానికనుగుణంగానే ఏర్పాట్లు జరుగుతాయని తెలిపారు. దీనిపై డబ్ల్యూహెచ్‌వోతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
నిపుణుల బృందం చైనాలోకి ప్రవేశించేందుకు చివరి నిమిషం వరకు అనుమతులు జారీ చేయలేదని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ చైనాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ దేశాల నుంచి నిపుణులు ఇప్పటికే చైనాకు బయలుదేరారని తెలిపారు. వారిలో ఏ ఒక్కరికీ చైనా ఇంత వరకు అనుమతులు జారీ చేయలేదని వెల్లడించారు. డబ్ల్యూహెచ్‌వో, చైనా ప్రభుత్వం కలిసే నిపుణుల బృంద పర్యటనపై నిర్ణయానికి వచ్చినట్లు గుర్తు చేశారు.













