అది నిర్ణయించేది బైడెన్ కాదు.. రష్యా ప్రజలే
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఉండే అర్హత లేదంటూ పోలెండ్‌లో ప్రసంగం సందర్బంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ వ్యాఖ్యలు ప్రపంచ దేశాల్లో చర్చకు దారి తీశాయి. రష్యా అధ్యక్షుడిని పదవిలో నుంచి దింపేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందంటూ దౌత్య వర్గాల్లో చర్చ మొదలైంది. పుతిన్‌ను దించేసేందుకు ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతోందంటూ వాదనలు మిన్నంటాయి. రష్యా కూడా వెంటనే దానిపై ఘాటుగానే బదులిచ్చింది. రష్యా అధ్యక్షుడిని దింపే అధికారం బైడెన్ కు లేదని, రష్యా ప్రజలే పుతిన్ ఎన్నుకున్నారని, వారికే అధికారం ఉంటుందని ప్రకటించింది.
అయితే తాజా బైడెన్ వ్యాఖ్యలపై అమెరికా శ్వేత సౌధ అధికారులు వివరణ ఇచ్చారు. పుతిన్‌ను దింపేసే ఉద్దేశం బైడెన్‌కు లేదని, ఆయన వ్యాఖ్యలకు అర్థం అది కాదని స్పష్టం చేశారు. పొరుగు దేశాలపై అధికారం చెలాయించే హక్కు పుతిన్‌కు లేదన్నది మాత్రమే బైడెన్ ఉద్దేశమని వివరణ ఇచ్చారు. అప్పుడప్పుడు బైడెన్ నోటి నుంచి పొరపాటున అలాంటి పదాలు వస్తుంటాయని, నత్తి సమస్య నుంచి బయటపడేందుకు అధ్యక్షుడు చాలా వేగంగా మాట్లాడుతుంటారని, ఆ క్రమంలోనే పొరపడి ఉంటారని చెప్పారు. అయితే బైడెన్ పొరపాటున ఆ వ్యాఖ్యలు చేసినా పుతిన్ ను రెచ్చగొట్ట అకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.













