త్వరలోనే వాట్సాప్ లో కొత్త నిబంధనలు!
ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది యూజర్లు ఉన్న వాట్సాప్ త్వరలోనే కొత్త నిబంధనలు, ప్రైవసీ పాలసీని తీసుకొస్తోంది. ఇప్పటికే చాలా మంది యూజర్లకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వస్తున్నాయి. ఈ కొత్త నిబంధనలకు ఫిబ్రవరి 8లోగా అంగీకరించకపోతే మీ వాట్సాప్ పని చేయదు. ఈ నోటిఫికేషన్లపై క్లిక్ చేస్తే.. వాట్సాప్ యూజర్ల డేటాను ఎలా సేకరించి, ప్రాసెస్ చేస్తుందన్న అంశాలతో పాటు తన మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో వాట్సాప్‌కు ఉన్న భాగస్వామ్యం గురించి వివరాలు కనిపిస్తున్నాయి. మీరు వాట్సాప్‌ను ఇన్స్టాల్, యాక్సెస్ లేదా సేవలను వాడుకుంటున్నప్పుడు మరింత మెరుగైన సేవలు అందించడానికి వాట్సాప్ కచ్చితంగా మీ సమాచారాన్ని సేకరిస్తుందని పాలసీ విధానంలో వాట్సాప్ సృష్టం చేసింది.
ఈ కొత్త నిబంధనలు, ప్రైవసీ పాలసీ ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఒకే వ్యవస్థగా పని చేసే ఉద్దేశంతో తాము మెసెంజర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను విలీనం చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ గత అక్టోబర్ నెలలోనే వెల్లడించారు. ఒకవేళ యూజర్లు తమ సేవలను థర్డ్ పార్టీ సేవలు లేదా ఫేస్బుక్ కంపెనీ ప్రొడక్ట్‌లతో కలిపి ఉపయోగిస్తే వాటి నుంచి యూజర్ల సమచారాన్ని వాట్సాప్ సేకరిస్తుందని కూడా ఈ కొత్త ప్రైవసీ పాలసీలో వాట్సాప్ సృష్టం చేసింది.













