వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మృతి ?
రష్యాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. రష్యా అనుకూల కిరాయి సైనిక ముఠా వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ కూడా వారిలో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ప్రయాణికుల జాబితాలో ఆయన పేరు కూడా ఉన్నట్టు అధికారులు ధ్రువీకరించారు. అయితే ప్రిగోజిన్ విమానం ఎక్కిందీ లేనిదీ తేలడం లేదు. అతని సొంత విమానమని చెబుతున్న సదరు ప్రైవేట్ బిజినెస్ జెట్ రష్యా రాజధాని మాస్కోకు 100 కిలోమీటర్ల దూరంలో త్వెర్ ప్రాంతంలో కుప్పకూలింది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో వాగ్నర్ గ్రూప్ రష్యా తరపున పోరాడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో రష్యా సైనిక నాయకత్వం మీద వాగ్నర్ గ్రూప్ సాయుధ తిరుగుబాటు చేసి విఫలమైంది. అనంతరం ప్రిగోజిన్‌ను బెలారస్‌కు ప్రవాసం పంపుతున్నట్లు రష్యా ప్రకటించింది. వాగ్నర్ గ్రూప్ సభ్యులు కూడా ఆయనను అనుసరించడమో, రిటైర్ అవడమో, రష్యా సైన్యంలో చేరడమే చేయొచ్చని పేర్కొంది.













