బోస్టన్ లో దారుణం.. ఆంధ్రప్రదేశ్ వాసి మృతి
అమెరికా లోని బోస్టన్ లో దారుణం చోటు చేసుకుంది. భారత్ నుంచి వస్తున్న తన స్నేహితుడిని పికప్ చేసుకునేందుకు విమానాశ్రయానికి వెళ్లిన ఓ ఇండో అమెరికన్ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బోస్టన్లోని లోగన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. మార్చి 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశ్వచంద్ కోళ్ల ( 47) గా గుర్తించారు. ఆయన అమెరికాలోని తకెడ ఫార్మాస్యూటికల్ సంస్థలో డేటా అనలిస్ట్‌గా పని చేస్తున్నారు. భారత్ నుంచి ఓ సంగీత వాయిద్య కళాకారుడైన తన స్నేహితుడు వస్తున్నాడని తెలుసుకొని ఆయన్ని పికప్ చేసుకునేందుకు విశ్వచంద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. తన ఎస్యూవీ వాహనంలో విమానాశ్రయం బయట టెర్మినల్ బి వద్ద వేచి చూస్తుండగా అటువైపుగా వస్తున్న డార్ట్మౌత్ ట్రాన్స్పోర్ట్కు చెందిన వాహనం ఎస్యూవీ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. సమీపంలో ఉన్న నర్సు వెంటనే స్పందించి విశ్వచంద్‌ను కారునుంచి బయటకి తీసి పరీక్షించింది. అయితే, అప్పటికే అతడు పాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారు డార్ట్మౌత్ వాహనం నడిపిన మహిళా డ్రైవర్‌ను ప్రశ్నించి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న మస్సాచు సెట్స్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.













