అమెరికాలో భారీ పేలుడు..
అమెరికాలో భారీ పేలుడు ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ పండుగ రోజున ఈ ఘటన జరుగడం కలకలం సృష్టించింది. టెన్నటీ రాష్ట్రంలోని నాష్విల్లే పట్టణంలో ఓ ప్రాంతంలో నిలిపి ఉంచిన వవాహనంలో పేలుడు చోటు చేసుకుంది. పేలుడు ధాటికి నగరం కంపించగా సుమారు 20 భవనాలతో పాటు వాహనాలు దెబ్బతిన్నాయి. ఇందులో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. అయితే పేలుడు ఉద్దేశపూర్వకంగానే జరిగిందని తాము నమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ ప్రతినిధి డాన్ ఆరోన్ మాట్లాడుతూ ఉదయం 6:30 గంటలకు పేలుడు జరిగిందని ఇది ఉద్దేశపూర్వక చర్య అని పేర్కొన్నారు. పేలుడులో గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించామని, వారికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆరోన్ పేర్కొన్నారు.
పేలుడు కేసును ఎఫ్బీఐ దర్యాప్తు చేస్తుందని జోయెల్ సిస్కోవిన్ పేర్కొన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో ఎఫ్బీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పేలుడు సంభవించిన ప్రాంతంలో మానవ శరీరానికి సంబంధించిన కొన్ని అవశేషాలు ఉన్నాయని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే అవి ఎవరివన్నది మాత్రం పోలీసులు ఇంకా గుర్తించలేదు. పేలుడుకు కారణమైన వ్యక్తికి చెందినవై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. లేదంటే పేలుడు సమయంలో దగ్గరలో ఉన్న వారివైనా అయి ఉంటాయని భావిస్తున్నారు. దీనిపై ఇంకా సృష్టత రావాల్సి ఉంది.













