అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేత : అమెరికా
అంతర్జాతీయ ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి భారతీయులు తిరిగి వెళుతున్నారు. అమెరికా, భారత్ మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న వారిని అనుమతిస్తున్నట్లు అగ్రరాజ్యం ఇటీవల ప్రకటించింది. అలాగే భూ, ఆకాశ మార్గాలను పునరుద్ధరించింది. దీంతో ఆంక్షల కారణంగా భారతీయులతో పాటు అనేక దేశాలవారు తిరిగి అమెరికా ప్రయాణమవుతున్నారు. అమెరికా తీసుకున్న నిర్ణయం తమకు ఉపశమనం కలిగించిందని వారు పేర్కొంటున్నారు.
విమానయాన సంస్థలు ప్రయాణికుల ధ్రువీకరణ పత్రాలన్నీ పరిశీలించాకే ప్రయాణాలకు అనుమతించాలని, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు 35 వేల డాలర్ల జరిమానా విధిస్తున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. అమెరికాకు ప్రయాణమయే ముందే విదేశీ పౌరులకు వ్యాక్సినేషన్ పూర్తయి ఉండాలి. ప్రయాణానికి ముందు 72 గంటల లోపు చేయించుకున్న పరీక్ష నెగెటివ్ రిపోర్టును అధికార్లుకు చూపించాలి. అయితే మెక్సికో, కెనడాల నుంచి రోడ్డు, జల మార్గాల ద్వారా వచ్చే ప్రయాణికులు కొవిడ్ టెస్ట్ చేయించుకోవలసిన అవసరం లేదు. 18 ఏళ్ల లోపువారు టీకాలు తీసుకుని ఉండాల్సిన అవసరం లేదు. రెండేళ్లు అంతకన్నా చిన్నపిల్లలకు కొవిడ్ పరీక్ష అవసరం లేదు.













