ఆ పనే ఉత్తర కొరియా చేస్తే… ఈ ప్రాంతం
తన దగ్గర గుట్టలుగుట్టలుగా అణ్వాయుధాలు పోగేసుకున్న అమెరికా ఉత్తర కొరియా అణు పరీక్షను నిర్వహిస్తే సహించేది లేదని బెదిరింపులకు దిగుతోంది. గత వారంతంలో బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించడంపై అగ్రరాజ్యం కుతకుతలాడుతోంది. ఒకవైపు దక్షిణ కొరియాతో కలిసి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ కవ్వింపు చర్యలకు దిగుతున్న అమెరికా, ఆ పనే ఉత్తర కొరియాను చేస్తే ఈ ప్రాంతం సమగ్రతకు ప్రమాదమని చెబుతోంది. జపాన్ క్షిపణి పరీక్షలను నిర్వహిస్తే అభ్యంతరం చెప్పని అమెరికా ఉత్తర కొరియాను మాత్రం బెదిరిస్తున్నది. ఇది అగ్ర రాజ్య ద్వంద్వ నీతికి నిదర్శనం కాదా అని ఉత్తర కొరియా ప్రశ్నిస్తున్నది. దక్షిణ కొరియా డిప్యూటీ విదేశాంగ మంత్రితో సమావేశానంతరం అమెరికా డిప్యూటీ విదేశాంగ మంత్రి వెండీ షెర్మాన్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తర కొరియా అణు పరీక్షను నిర్వహిస్తే తీవ్రమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వుంటుందని అన్నారు.













