భారీగా విద్యార్థి వీసా అపాయింట్ మెంట్లు !
అమెరికా విద్యార్థి వీసాలు హాట్ కేకుల్లా మారాయి. ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ తేదీలు ( స్లాట్లు) విడుదల చేసిన గంటల వ్యవధిలోనే రెండుచోట్ల భర్తీ అయిపోయాయి. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ప్రారంభమయ్యే ఫాల్ విద్యా సంవత్సరానికి తొలివిడతగా ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్కతా, హైదరాబాద్లోని అమెరికా కార్యాలయాల పరిధిలో వీసా స్లాట్లు విడుదలయ్యాయి. ఫాల్ విద్యాసంవత్సరంలో పెద్దసంఖ్యలో విద్యార్థులు భారత్ నుంచి ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళుతుంటారు. గత ఏడాది మాదిరిగానే విద్యార్థులకు ఈసారి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కిందటి నెలలో యూఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు దేశంలోని 5 కాన్సులేట్ కార్యాలయాల్లో తాజాగా పెద్ద సంఖ్యలో జూన్ నెలకు వీసా స్లాట్లను విడుదల చేసింది. హైదరాబాద్, ఢిల్లీల్లో మాత్రం విడుదల చేసిన మూడు, నాలుగు గంటల్లోనే స్లాట్లు భర్తీ కావడం గమనార్హం.













