రహస్య జైలును మూసేసిన అమెరికా
క్యూబాలోని గ్వాంటనామో బేలో అమెరికా మిలిటరీకి చెందిన ఒక రహస్య జైలును మూసివేశారు. క్యాంప్ 7 శిథిలావస్థకు చేరడంతో అందులోని ఖైదీలను సురక్షితంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా క్యాంప్ 5కు తరలించినట్లు యూఎస్ మిలిటరీ తెలిపింది. అయితే ఎంత మంది ఖైదీలు, ఎప్పుడు తరలించారు అన్నది వెల్లడించలేదు. కాగా గ్వాంటనామో జైళ్లలో సుమారు 40 మంది ఖైదీలు ఉన్నారని, క్యాంప్ 7లో 14 మంది ఉన్నట్లు నిర్వహణ బాధ్యతలు చూసే మియామికి చెందిన సదరన్ కమాండ్ గతంలో తెలిపింది.
రహస్య జైలు అయిన ఇందులో ఆ దేశ నిఘా సంస్థ సీఐఏ నిర్బంధించిన కరుడుగట్టిన నేరస్తులను ఉంచుతారు. వారిని క్రూరమైన పద్ధతుల్లో టార్చర్‌కు గురి చేస్తారు. దీంతో ఈ రహస్య జైళ్లను బ్లాక్ సైట్లు అని వ్యవహరిస్తారు. సీఐఏతో ఒప్పందం ప్రకారం అమెరికా సైన్యం దీనిని నిర్వహిస్తుంది. 2001 సెప్టెంబర్ 11 ఉగ్ర దాడులకు సహకరించి యుద్ద నేరాలకు పాల్పడిన ఐదుగురు ఖైదీలను ఇందులో ఉంచినట్లు సమాచారం. మరోవైపు క్యాంప్ 7 ఎక్కడ ఉన్నది అన్నది ప్రపంచానికి తెలిపేందుకు చాలా కాలం వరకు అమెరికా నిరాకరించింది. గ్వాంటనామో బేలోని సైనిక రహస్య జైళ్లను మూసి వేయాలని అమెరికా కొత్త అధ్యక్షుడు భావిస్తున్నారు. అయితే అక్కడి ఖైదీలను అమెరికాకు తరలించి విచారణ జరిపేందుకు కాంగ్రెస్ ఆమోదం అవసరం. 2006 డిసెంబర్లో గ్యాంటనామో బేలో క్యాంప్ 7ను అమెరికా ప్రారంభించింది.













