హేట్ క్రైమ్స్ బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం
ఆసియన్ అమెరికన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న హింస, విద్వేష దాడులను నివారించేందుకు హేట్ క్రైమ్స్ బిల్ ను అమెరికా సెనెట్ ఆమోదించింది. సభలో ఈ బిల్లు 94-1 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. సెనెటర్ మిస్సౌరి ఒక్కరే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. ఈ బిల్లు డెమోక్రాట్లకు స్పష్టమైన మెజార్టీ ఉండే ప్రతినిధుల సభకు వెళ్లనుంది. బిల్లును ఆమోదించాలని అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో అది లాంచనం కానుంది. బిల్లుపై సెనేట్లో జరిగిన చర్చల్లో సెనేట్ మెజార్టీ నేత చుక్ స్కమ్మర్ మాట్లాడుతూ పనిచేసేందుకు అవకాశం వచ్చినప్పుడు, సెనెట్ కచ్చితంగా పనిచేస్తుంది. ఒక ముఖ్యమైన సమస్యను పరిగణనలోకి తీసుకొని, దానిపై స్పందించే చట్టాన్ని తీసుకొచ్చేందుకు రెండు వైపులకు చెందిన సభ్యులు కలిసి పనిచేశారు అని పేర్కొన్నారు.
తాజా బిల్లు ప్రకారం కోవిడ్ 19 సమయంలో పోలీసుల వద్దకు వచ్చిన ఈ విద్వేష నేరాలపై సమీక్షించేందుకు న్యాయశాఖ అధికారిని నియమిస్తుంది. నేరాలను నివేదించేందుకు, ప్రజలకు అవగాన కల్పించేందుకు వివక్షాపూరిత చర్యలను నియంత్రించెందుకు స్థానిక పోలీసులకు తగిన మార్గదర్శకాలు ఇస్తుంది. విద్వేష నేరాలపై వచ్చిన ఫిర్యాదులపై న్యాయశాఖ స్పందనను ఈ చట్టం మెరుగుపరుస్తుందని డెమోక్రాట్ సెనేటర్ డిక్ డర్బిన్ పేర్కొన్నారు. కాగా, 2019 నుంచి 2020 మధ్య అమెరికాలోని 16 పెద్ద నగరాల్లో ఆసియన్ అమెరికన్లపై విద్వేష ఘటనలు 149 శాతం పెరిగినట్లు కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నివేదిక చెబుతోంది.













