రష్యా సేనలపై ఉక్రెయిన్ మరోసారి ఎదురుదాడి
రష్యా సేనలను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ మరోసారి ఎదురుదాడికి దిగింది. నీపర్ నదిపైనున్న ఆంటోనివ్స్కీ వంతెనపై అమెరికన్ హైమార్స్ క్షిపణులతో దాడి చేసింది. 1.4 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనపై గతవారం కూడా ఉక్రెయిన్ ఫిరంగులతో గుళ్లవర్షం కురిపించింది. దీంతో వంతెనకు నష్టం కలిగి ట్రక్కుల రాకపోకలు నిలిచిపోయాయి. కానీ ప్రయాణికుల వాహనాలను మాత్రం అనుమతించారు. మంగళవారం దాడిలో వంతెనకు పెద్దఎత్తున రంధ్రాలు పడటంతో రవాణా పూర్తిగా స్తంభించిపోయింది.
దక్షిణ ఉక్రెయిన్ను ఆక్రమించిన తన సేనలకు సరుకులు, ఆయుధాలు సరఫరా చేయడానికి రష్యా ఈ వంతెననే ఉపయోగిస్తోంది. ఇప్పుడిది పూర్తిగా బంద్ అయిపోవడంతో అక్కడికి కొంతదూరంలోనే ఖాఖోవ్కా జలవిద్యుత్ కేంద్రం పై నున్న వంతెన మాత్రమే రాకపోకలను ఆధారంగా ఉంది. ఉక్రెయిన్ దీని పైనా గతవారం దాడిచేసినా వాహనాలను రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యుద్దంలో రష్యా ఇప్పటి వరకు 40 వేల మందికి పైగా సైనికులకు కోల్పోయిందని, వేల మంది గాయాలపాలయ్యారని ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్స్కీ చెబుతున్నారు.













