జపాన్ నుంచి అమెరికా బయలుదేరిన విమానంలో.. వింత ఘటన
విమానంలో కొందరు ప్రయాణికుల ప్రవర్తన తోటి ప్రయాణికులు, సిబ్బందికి ఎంతో ఇబ్బంది కలిగిస్తోంది. మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు మహిళా సిబ్బంది చేతిని కొరికాడు. ఈ ఘటన ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్ కు చెందిన ఓ విమానంలో చోటు చేసుకొంది. 159 మంది ప్రయాణికులతో ఏఎన్ఏ విమానం జపాన్ నుంచి అమెరికాకు బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికి అందులోని మద్యం ఎక్కువగా తాగివున్న 55 ఏళ్ల ఓ ప్రయాణికుడు మత్తులో మహిళా సిబ్బంది చేతిని కొరికాడు. గమనించిన మిగితా సిబ్బంది ఆ ప్రయాణికుడిని అడ్డుకున్నారు. ఈ ఘటనతో తోటి ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. విమానం పసిఫిక్ మహాసముద్రంపై నుంచి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని పైలట్‌కు తెలియజేయడంతో విమానాన్ని తిరిగి జపాన్‌కు మళ్లించి నిందితుడిని పోలీసులకు అప్పగించారు. అతడిని విచారించగా, జరిగిన విషయం తనకు గుర్తులేదంటూ సమాధానం ఇచ్చినట్లు ఎయిర్వేస్ ప్రతినిధి తెలిపారు.













