ఫ్లాయిడ్ మృతి కేసులో.. పోలీసు అధికారే దోషి!
అమెరికాలో సంచలనం రేపి.. ప్రపంచం మొత్తం జాతివిద్వేషంపై చర్చ లేవనేపిన జార్జి ఫ్లాయిడ్ మృతి కేసులో న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఈ కస్టోడియల్ మృతి కేసులో పోలీసు అధికారి డెరెక్ చౌవిన్(45)ను దోషిగా తేల్చింది. గతేడాది మే 25న ఫ్లాయిడ్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో చౌవిన్.. పోలీసు జులుం ప్రదర్శించాడు. అతని మెడపై కాలుతో బలంగా తొక్కిపెట్టి ఊపిరాడకుండా చేయడంతో ఫ్లాయిడ్ మరణించాడు. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసుపై 12 మంది జ్యూరీ సభ్యులతో కూడిన న్యాయస్థానం విచారణ చేపట్టింది. చౌవిన్‌ను దోషిగా తేల్చిన ఈ న్యాయస్థానం.. 8 వారాల్లో అతనికి విధించే శిక్షను ఖరారు చేయనున్నట్లు తెలిపింది. కాగా, చౌవిన్‌కు ఈ కేసులో 40 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు కొందరు నిపుణులు చెప్తున్నారు. అయితే కోర్టు విచారణ సమయంలో తాను ఎటువంటి నేరమూ చేయలేదని చౌవిన్ బుకాయించాడు. న్యాయస్థానం తీర్పుపై కోర్టు వెలుపల, ఫ్లాయిడ్ స్వస్థలంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ‘‘అమెరికా నల్లజాతీయులకు న్యాయం జరిగితే అమెరికన్లు అందరికీ న్యాయం జరిగినట్లే. ఈ కేసు అమెరికా చరిత్రలో కీలకమైన మలుపుగా నిలిచిపోతుంది’’ అని ఫ్లాయిడ్ కుటుంబం, వారి తరఫు న్యాయవాది ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్.. ఫ్లాయిడ్ కుటుంబంతో ముచ్చటించారు. ‘‘అమెరికా నల్లజాతీయుల ప్రతిరోజూ జాత్యహంకారం వల్ల బాధ పడుతున్నారు. తాజా తీర్పు ఈ విషయంలో న్యాయాన్ని అందించింది. ఇక్కడితో మనం ఆగకూడదు. మరోసారి ఇలాంటి విషాదాలు జరగకుండా ఉండేందుకు కృషి చేయాలి. ఈ తీర్పు అమెరికా న్యాయవ్యవస్థలో గొప్ప ముందడుగు’’ అని బైడెన్ చెప్పారు. ‘‘ఈ తీర్పు మనల్ని లక్ష్యానికి ఒకడుగు చేరువ చేసింది. మనం చేయాల్సింది ఇంకా చాలా ఉంది’’ అని కమల పేర్కొన్నారు.













