విదేశీ విద్యార్థులకు అమెరికా ఆహ్వానం
సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (స్టెమ్) సబ్జెక్టుల్లో నైపుణ్యం ఉన్న విదేశీ విద్యార్థులను ఆకట్టుకునేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేయనుంది. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం విధానపరమైన మార్పులను ప్రకటించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో పోటీతత్వాన్ని మరింతగా పెంచే విస్తృత ప్రణాళికలో భాగంగా ఈ చర్యను చేపట్టింది. కొత్త నిబంధనల ప్రకారం అర్హులైన విదేశీ విద్యార్థులు అదనంగా 36 నెలల పాటు అమెరికన్ కంపెనీల్లో విద్యాపరమైన శిక్షణ పొందేందుకు వీలు కలుగుతుంది. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా విజువలైజేష్, డేటా సైన్స్ వంటి 22 రంగాలకు కొత్తగా ఈ కార్యక్రమ పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ విద్యార్థులను అమెరికాలోని వ్యాపార సంస్థలతో అనుసంధానించేందుకు మరో కొత్త కార్యక్రమాన్ని ప్రకటించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైపుణ్యాన్ని ఆకర్షించే దేశంగా అమెరికా ఉండాలన్న ఉద్దేశంతో వీటిని చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. అకడమిక్ పరిశోధనలకు అంతర్జాతీయ విద్యార్థులే కీలకమని ఇప్పటికే స్సష్టమైందన్నారు.













