ముందున్నది ముసళ్ల పండగ.. కొన్ని దశాబ్దాల వరకూ ప్రపంచానికి సమస్యలే
వాషింగ్టన్ః కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచంలోని అనేక దేశాలు వ్యాధులు, ఆర్థిక అసమానతలు, వాతావరణ మార్పు, దేశాలలో అంతర్యుద్ధాలు, దేశాల మధ్య పోరాటాలు వంటి సమస్యలతో సతమతం కాబోతున్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక తెలియజేసింది. కోవిడ్ కారణంగా ఇప్పటికే అనేక దేశాలలో ఈ సమస్యలు ప్రారంభమయ్యాయని, ప్రపంచానికి అనేక సవాళ్లు ఎదురు కాబోతున్నాయని ఈ నివేదిక పేర్కొంది.
అమెరికా నాయకత్వంలోని పాశ్చాత్య దేశాలకు, చైనాకు మధ్య విభేదాలు, వివాదాలు, శత్రుత్వాలు శ్రుతిమించబోతున్నాయని, ప్రత్యక్షంగా సైనిక పోరాటాలు జరిగినా జరగవచ్చని గురువారం నాడు విడుదలయిన ఆ నివేదిక వెల్లడించింది. సైనిక బలగాలు, టెక్నాలజీలు, జనాభాలు, పాలనా విధానాలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని ‘గ్లోబల్ ట్రెండ్స్ 2040ః ఎ మోర్ కంటెస్టెడ్ వరల్డ్’ అనే పేరుతో అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ విడుదల చేసిన నివేదిక వివరించింది.
కొన్ని దేశాలు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తాయని, ప్రాంతీయ శక్తులు కూడా సవాళ్లు విసురుతుంటాయని, ఫలితంగా ప్రపంచంలో అనేక దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుందని అది తెలిపింది. రాజకీయ వాతావరణం బాగా కలుషితమైపోతుందని, వివిధ దేశాల మధ్య సహకారం సన్నగిలుతుందని అది తెలియజేసింది.
ఉన్నత స్థాయి అమెరికన్ ఇంటెలిజెన్స్ విశ్లేషకులు ఈ నివేదికను రూపొందించారు. నాలుగేళ్లకొకసారి ఈ నివేదికను రూపొందిస్తారు. వచ్చే 20 ఏళ్లలో ప్రపంచ దేశాల రాజకీయ, ఆర్థిక, సామాజిక వగైరా ధోరణులను పరిగణనలోకి తీసుకుని దీన్ని రూపొందిస్తారు. ‘‘విధాన రూపకర్తలను, పౌరులను సంసిద్ధం చేయడమే మా ఉద్దేశం. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఇప్పటి నుంచే దృష్టిలో పెంచుకోవడానికి ఈ నివేదికను రూపొందిస్తాం” అని ఇంటెలిజెన్స్ విశ్లేషకులు ఈ నివేదిక ఉపోద్ఘాతంలో తెలిపారు.
సమస్యలను పెంచిన వైరస్
తాము ఏ దేశాన్నీ ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని చెప్పడం లేదని, అయితే, అమెరికా నుంచి ఆఫ్రికా వరకూ ప్రతి దేశానికీ ఇది వర్తిస్తుందని వారు పేర్కొన్నారు. వాతావరణ మార్పు, ఆర్థిక సంక్షోభాలు, వ్యాధులు, టెక్నాలజీలలో ఆటంకాలు తదితర సవాళ్లు దాదాపు ప్రతి దేశంలోనూ పేట్రేగుతాయని, అనేక సమస్యలు సృష్టిస్తాయని వారు తెలిపారు.
సుమారు 30 లక్షల మందిని పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి ప్రపంచ యుద్ధానికంటే భయంకరమైనదని, దీని దుష్ఫలితాలు మరికొన్ని దశాబ్దాల పాటు కొనసాగడం ఖాయమని ఆ నివేదిక తెలిపింది. ‘‘ఈ వైరస్ ఆరోగ్య సంరక్షణలోని లోపాలను బయటపెట్టింది. అనేక దేశాలను ఆర్థికంగా అధోగతి పాలు చేసింది. జాతీయవాదాన్ని పెంచింది. రాజకీయ ఏకీకరణలకు అవకాశమిచ్చింది. ఆర్థిక ఆసమానతలను పెంచింది. ప్రభుత్వాల మీద నమ్మకాన్ని సడలించింది. అంతర్జాతీయ సహకారానికి తూట్లు పొడిచింది” అని అది తెలిపింది.
‘‘వీటన్నిటి ఫలితంగా, పేదరికం, వ్యాధులపై పోరాడే శక్తి వెనకపట్టు పట్టింది. లైంగిక అసమానత ఎక్కువైంది” అని ఆ నివేదిక వివరించింది. ఈ సమస్యలు, సవాళ్లన్నీ 2040 వరకూ కొనసాగడానికి అవకాశం ఉందని అది తెలిపింది. ఇటువంటి ధోరణులు మరీ తీవ్రం కావడమో, విస్తరించడమో జరిగి అనేక దేశాల పరిస్థితి అతలాకుతలం అవుతుందని అంటూ, 2040 తర్వాత అనేక దేశాల పరిస్థితి ఇప్పుడున్నట్టుగా ఉండకపోవచ్చని అది జోస్యం చెప్పింది.
ఇక 2040 తర్వాత అనేక దేశాలు ఎలా ఉండబోతున్నాయో అది సూచనప్రాయంగా తెలిపింది. ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థల పునరుజ్జీవనం జరుగుతుంది. ప్రభుత్వాలు సరికొత్త విధానాలను రూపొందించుకుంటాయి. వైజ్ఞానిక పరిశోధనలకు, సాంకేతిక పరిజ్ఞాన ఆవిష్కారాలకు, ఆర్థిక వ్యవస్థల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తాయి. దేశంలో ఎదురవుతున్న ఒత్తిడిని ఎదుర్కుంటూనే అంతర్జాతీయంగా వస్తున్న సవాళ్ల మీద దృష్టిని కేంద్రీకరిస్తాయి’’ అని అది తెలిపింది. ప్రస్తుతానికి మాత్రం ఆహారం కోసం పోరాటాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, వైరస్ కారణంగా ఆహార సరఫరా వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయని అది తెలిపింది.













