అమెరికా ప్రతినిధుల సభలో కీలక బిల్లుకు ఆమోదం.. 5 లక్షల మంది భారతీయులకు గుడ్‌న్యూస్ !
వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్) కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. 228-197 ఓట్ల తేడాతో ‘ది అమెరికన్ డ్రీమ్స్ అండ్ ప్రామిస్ యాక్ట్ 2021’కు పచ్చజెండా ఊపింది. ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు.. సెనేట్‌లో గట్టెక్కి, బైడెన్ సంతకంతో చట్టరూపం దాల్చితే.. దాదాపు 5లక్షల మంది భారతీయులకు లబ్ధి చేకూరనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అక్రమవలసదారులపై జో బైడెన్ వరాలు కురిపించారు. ఎన్నికల్లో గెలిచి, అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తే 11 మిలియన్ల మంది అక్రమవలసదారులకు అమెరికా పౌరసత్వం ఇస్తానని ప్రకటించారు. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్‌పై భారీ విజయం సాధించారు. జనవరి 20న అగ్రరాజ్య అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై బైడెన్ ఫోకస్ పెట్టారు.
2021 జనవరి 21 ముందు సరైన ధ్రువపత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించిన 18ఏళ్లలోపు యువతకు పౌరసత్వం ఇచ్చేందుకు మార్గం సుగమం చేయాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ‘ది అమెరికన్ డ్రీమ్ అండ్ ప్రామిస్’ అనే పేరుతో ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టింది. కాగా.. ఈ బిల్లుకు ప్రతినిధుల సభ గురువారం ఆమోదం తెలిపింది. 228 మంది సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. అయితే సెనేట్‌లో ఈ బిల్లు పాసవ్వడానికి రిపబ్లికన్ల నుంచి ఏమైనా ప్రతిఘటన ఉంటుందా? అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సెనేట్‌లో బిల్లు పాసవ్వాలంటే రిపబ్లికన్లలో కూడా కొంత మంది మద్దతు తప్పనిసరి. అక్కడ కూడా ఆమోదం లభిస్తే జో బైడెన్ సంతకంతో ఈ బిల్లు చట్ట రూపం దాలుస్తుంది. ఇదే జరిగితే లక్షలాది మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభించే అవకాశం ఉంది. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వారి పిల్లలకు, హెచ్1బీ వీసా ద్వారా వచ్చిన టెక్ నిపుణుల పిల్లలకు, తల్లిదండ్రులు సరైన పత్రాలతో అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టినా.. వారి పిల్లలను అక్రమవలసదారుల గుర్తించినట్టైతే అలాంటి వారికి కూడా ఈ చట్టం ద్వారా అమెరికా పౌరసత్వం దొరుకుతుంది.













