గే పెళ్లిళ్ల బిల్లుకు అమెరికా దిగువ సభ ఆమోదం
స్వలింగ సంపర్కుల వివాహాలకు రక్షణ కల్పించేలా అమెరికా చర్యలు చేపట్టింది. ఈ మేరకు దిగువ సభలో బిల్లును ఆమోదించింది. పలువురు రిపబ్లికన్లు ఈ బిల్లును వ్యతిరేకించినా 47 మంది మాత్రం డెమోక్రాట్లకు మద్దతు పలికి బిల్లును ఆమోదించడంలో సహకరించారు. దీంతో 267-157 ఓట్ల తేడాతో బిల్లు దిగువ సభ గడప దాటింది. ఈ ఏడాది మధ్యంతర ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజకీయ వ్యూహంలో భాగంగా ఈ బిల్లును తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. బిల్లుకు సెనేట్ ఆమోదం లభించాల్సి ఉంది. 100 స్థానాలు ఉన్న ఈ సభలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు చెరిసగం ఉన్నారు. ఎక్కువమంది రిపబ్లికన్లు ఈ బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. అమెరికాలోని సాధారణ పౌరుల్లో స్వలింగ సంపర్కుల వివాహాలపై సానుకూలత వ్యక్తమవుతోంది. జూన్లో నిర్వహించిన ఓ పోల్లో 79 శాతం అమెరికా వయోజనులు గే వివాహాలను చట్టబద్ధం చేయాలని కోరుకున్నారు.













