ఇదే మనకు చివరి అవకాశం : అమెరికా
భూతాపాన్ని నియంత్రించడానికి ఇదే చివరి అవకాశమని అమెరికా ప్రతినిధి జాన్ కెర్రీ కాప్-28 వాతావరణ సదస్సును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దుబాయి వేదికగా జరుగుతోన్న ఈ శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడారు. కాప్ 28 అధ్యక్షుడు సుల్తాన్ అల్ జాబెర్ ప్రతిపాదించిన ముసాయిదాలో శిలాజ ఇంధనానికి దశలవారీగా స్వస్తి చెప్పాలని పేర్కొనకపోవడం అమెరికాను నిరూత్సపర్చిందని తెలిపారు. శిలాజ ఇంధనం స్వస్తికి ప్రతిజ్ఞ చేయాలని ప్రపంచానికి చెబుతున్నాం. కానీ, మనలో చాలా మంది ఆ ప్రతిజ్ఞను వ్యతిరేకించేవాళ్లున్నారు అని కెర్రీ అన్నారు. పారిస్ ఒప్పందం ప్రకారం భూతాపం పెరుగుదలను 1.5 సెల్సియస్ డిగ్రీల వద్ద స్థిరీకరించాలి. ఇందుకోసం 2030 నాటికి కర్బన ఉద్గారాలను 50 శాతం మేర తగ్గించాలి. తద్వారా భూతాపాన్ని నియంత్రించాలి. ఈ లక్ష్యాన్ని చేరడానికి ఇదే మనకు చివరి అవకాశామని కెర్రీ తెలిపారు. ఈ బాధ్యతను నిర్వర్తించడంలో కాప్ 28 భాగస్వామ్య దేశాలు వైఫల్యం చెందవని ఆశాభావం వ్యక్తం చేశారు.













