వెనక్కి తగ్గేది లేదు.. అండగా ఉంటాం
రష్యాతో సాగుతోన్న పోరులో ఉక్రెయిన్‌కు ఎల్లవేళలా అండగా నిలుస్తామని ఐరోపా సమాఖ్య (ఈయూ) పేర్కొంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఈయూ 27 సభ్యదేశాల విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించారు. ఈయూ సభ్యదేశాల వెలుపల ఈ సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ రక్షణ, దౌత్యం, ఆర్థికం, ఆంక్షల విషయంలో మనం ఎంత వేగంగా ఉమ్మడి అడుగులు వేస్తే. యుద్ధం అంత త్వరగా ముగుస్తుందని మంత్రులనుద్ధేశించి వ్యాఖ్యానించారు. పరస్పర సహకారంపైనే విజయం ఆధారపడి ఉందన్నారు. ఐరోపా సమాఖ్య విదేశాంగ పాలసీ చీఫ్ జోసెప్ బోరెల్ ఈ భేటీని చరిత్రాత్మకంగా అభివర్ణించారు. ఉక్రెయిన్‌కు భద్రత, సైనిక సాయం, ఈయూలో చేరిక, శాంతి స్థాపన తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. కీవ్‌కు తొలి మద్దతుదారు ఈయూనేని, ఈ దేశానికి సాయం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.













