ఉక్రెయిన్‌లో రష్యా మరో దుశ్చర్య
ఉక్రెయిన్‌లో జనావాసాలపై రష్యా మరోసారి రాకెట్లను ప్రయోగించింది. ఉక్రెయిన్ చాసిన్ యార్ పట్టణంలోని ఐదంతస్తుల భవనంపై రష్యా ఉరగన్ క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. భవనం శిథిలాల్లో 20 మంది ఇరుక్కున్నారు. సమీపంలోని మరో ఐదంతస్తుల భవనంపైనా దాడి చేసినా, ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. పశ్చిమ దేశాల ఆయుధాలు ఉక్రెయిన్ దళాలకు చేరేందుకు కీలక రవాణా కేంద్రం క్రమాటోర్స్క్‌కు చాసివ్ యార్ కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో రష్యా తాజాగా దాడి చేసినట్లు భావిస్తున్నారు. డాన్‌బాస్‌లోని రెండో భాగమైన డొనెట్స్క్నూ పూర్తిగా ఆధీనంలోకి తీసుకునేందుకు పుతిన్ సేనలు ప్రయత్నిస్తున్నాయి. కాగా, డొనెట్స్క్ రీజియన్‌లోని ఇంకొన్ని ప్రాంతాలపైనా మాస్కో సైన్యం గురి పెట్టింది. ఖార్కీవ్‌లోని నివాస ప్రాంతంపై చేసిన దాడుల్లో ముగ్గురు చనిపోయారు. దీంతో ప్రజలు బయటకు రావొద్దంటూ సూచించారు.













