భారతీయులకు 15 రోజుల్లోనే విజిట్ వీసా
బ్రిటన్ పర్యటనకు వెళ్లనున్న వారికి దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే విజిట్ వీసాలు అందనున్నాయి. ఈ విషయాన్ని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లీస్ ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి 15 రోజుల్లోనే విజిట్ వీసా ఇస్తామని రెండు నెలల క్రితం ప్రకటించామని గుర్తు చేశారు. ఇంకా ముందుగానే కావాలనుకుంటే ప్రయారిటీ వీసా విధానాన్ని కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఆ మార్గంలో అయితే అయిదే రోజుల్లోనే వీసా వస్తుందని చెప్పారు. భారీ సంఖ్యలో స్టూడెంట్ వీసాలను కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు. జనవరిలో ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ వీసాలకు డిమాండ్ అధికంగా ఉన్నందున త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.













