యుఏఈ విప్లవాత్మక నిర్ణయం… జనవరి 1 నుంచి కొత్త విధానం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) విప్లవాత్మక మార్పునకు నాంది పలికింది. ఇకపై తమ దేశంలో వారానికి నాలుగున్నర రోజులే పని దినాలని ప్రకటించింది. అంతేకాకుండా వారాంతాన్ని కూడా ఇంతకు ముందున్న శుక్ర, శనివారాల నుంచి శని, ఆదివారాలకు మార్చింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వారాంతం శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ సంస్థలు, విభాగాలు అన్నీ ఈ కొత్త విధానాన్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచంలో నాలుగున్నర రోజుల పని విధానాన్ని పాటిస్తున్న తొలి దేశం తమదేనని అక్కడి అధకారులు అంటున్నారు. ఉద్యోగుల వృతిగత, వ్యక్తిగత జీవితాల మధ్య సమతౌల్యం సాధించడంతో పాటు ప్రపంచ మార్కెట్లలో పాటిస్తున్న విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది.













