అమెరికాలో ప్రమాదం.. ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గరు విద్యార్థులు గాయపడ్డారు. చికాగో సమీపంలోని అలెగ్జాండర్ కౌంటీ వద్ద ఈ ఘటన జరిగింది. పిక్నిక్కు వెళ్తున్న విద్యార్థుల కారును ఎదురుగా వస్తున్న మరో కారు బలంగా ఢీ కోట్టింది. ఈ ప్రమాదంలో నిజాంపేట నివాసముండే జేఎన్టీయూ ప్రోఫెసర్ పద్మజా రాణి చిన్న కుమారుడు పీచెట్టి వంశీకృష్ణ (23), అతని స్నేహితుడు పవన్ స్వర్ణ(23) అక్కడికక్కడే మృతి చెందారు. అదే కారులో ఉన్న వారి స్నేహితులు డి.కల్యాణ్, కె. కార్తీక్, ఉప్పలపాటి శ్రీకాంత్కలు గాయాలయ్యాయి.
చికాగోలోని ఓ ఆస్పత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. వీరి వాహనాన్ని ఢీకొట్టిన కారు నడుపుతున్న మహిళ కూడా ఘటనా స్థలంలోనే మృతి చెందింది. వంశీకృష్ణ, పవన్‌లు హైదరాబాద్ శివారులోని గోకరాజు రంగరాజు కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. సదరన్ ఇల్లినాయీ యూనివర్సిటీలో ఎంఎస్ చేసేందుకు గతేడాది నవంబరులో అమెరికా వెళ్లారు. ఇరువురి మృతదేహాలను తానాకు అప్పగించినట్లు వర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు అయినందున అక్కడి చట్టం ప్రకారం జరగాల్సిన ప్రక్రియలన్నీ పూర్తియి సోమ లేదా మంగళవారాల్లో మృతదేహాలు స్వదేశానికి రావచ్చని తెలిసింది.













