Indian Student: అమెరికాలో విషాదం.. తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి!
అగ్రరాజ్యం అమెరికాలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. నల్గొండ జిల్లా (Indian Student) మేళ్లదుప్పలపల్లి గ్రామానికి చెందిన పవన్ కుమార్ రెడ్డి (Pawan Kumar Reddy) అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు.
మంగళవారం రాత్రి తన స్నేహితులతో కలిసి భోజనం చేసిన పవన్ (Pawan Kumar Reddy).. ఆ వెంటనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన స్నేహితులు హుటాహుటిన అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ పవన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఆకస్మిక మరణంపై అమెరికా పోలీసులు (US Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫుడ్ పాయిజనింగ్ వల్లే (Indian Student) పవన్ మరణించాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా.. మరికొన్ని కథనాలు గుండెపోటు అని పేర్కొంటున్నాయి. అయితే అధికారులు మాత్రం ఇంకా పవన్ (Pawan Kumar Reddy) మరణానికి గల కచ్చితమైన కారణాన్ని ధృవీకరించలేదు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. చేతికి అందివచ్చిన కొడుకు అకాల మరణంతో పవన్ స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పవన్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.






