కాఫీ ప్రియులకు షాకింగ్ న్యూస్
పొద్దున్నే లేవగానే ఒక కాఫీ, లంచ్ మధ్యలో ఒక కాఫీ, సాయంత్రం పూట ఒక కాఫీ, మళ్లీ పడుకునే ముందు ఒక కాఫీ ఇలా రోజు మొత్తంలో నాలుగు, ఐదు కాఫీలు లాగించేస్తుంటారు చాలా మంది. కొందరికి ఇదొక అడిక్షన్ గా మారిపోతుంది కూడా. కానీ, ఇదేమీ సిగరెట్, మద్యం లాంటిది కాదు కదా. దీనితో ఎటువంటి ఇబ్బందులు రావు అనే భ్రమలో ఉంటారు. కానీ, అతిగా కాఫీ త్రాగడం వల్ల కూడా చాలా ప్రమాదం పొంచి ఉందని తాజా అధ్యయనంలో తేలింది. కాఫీ అధికంగా తాగడం వల్ల గుండె సమస్యలు వస్తాయని, ప్రతి రోజు ఐదు కప్పులకు మించి తాగడం వల్ల ఈ ప్రమాదం మరింతగా పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియాకి చెందిన సెంటర్ ఫర్ ప్రెసిషన్ హెల్త్ పరిశోధకులు వెల్లడించారు.
రోజుకు ఆరు లేదా అంతకంటే ఎక్కువ కప్పులు కాఫీ తాగడం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరగడమే కాకుండా, ఇది క్రమంగా హృదయ సంబంధ వ్యాధుల (సివిడి) ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని అధ్యయనవేత్తలు తేల్చి చెప్పారు. కాఫీతో లాభాలు, నష్టాల గురించి చాలా ఏళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే పానీయాల్లో ఒకటైన కాఫీ మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. అందువల్లే మా అధ్యయనం కూడా కాఫీపైనే చేశాం. రోజూ మోతాదుకు మించి కాఫీ తాగుతున్న వారిలో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగక గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని మా అధ్యయనంలో తేలింది అని ప్రొఫెసర్ హిప్పోనెన్ అన్నారు.













