ఎర్రసముద్రంలో అమెరికా సైనికుల మోహరింపు
ఇరాన్, అమెరికా ఉద్రిక్తతలతో ఎర్ర సముద్ర జలాలు వేడెక్కుతున్నాయి. తమ పౌర నౌకల్ని, చమురు ట్యాంకు నౌకల్ని ఇరాన్ స్వాధీనం చేసుకోవడం పట్ల అమెరికా బలంగా స్పందిస్తోంది. తాజాగా 3 వేలకు పైగా సైనికుల్ని యూఎస్స్ బతాన్, యూఎస్స్ కార్టర్ హాల్ యుద్ధనౌకల్లో ఎర్ర సముద్రంలోకి తరలించింది. అమెరికా ఐదవ ఫ్లీట్ ఈ విషయాన్ని తెలిపింది. గడిచిన రెండేళ్లలో తమ దేశానికి చెందిన కనీసం 20 నౌకలను స్వాధీనం చేసుకునేందుకు ఇరాన్ ప్రయత్నించిందని అమెరికా ఆరోపిస్తోంది. ప్రాంతీయంగా ఇరాన్ కలిగిస్తున్న ఉద్రిక్తల్ని, అస్థిరీకరణను అడ్డుకునేందుకు ఈ చర్య తీసుకున్నామని ఐదవ ఫ్లీట్ అధికార ప్రతినిధి టిమ్ హాకిన్స్ ప్రకటనలో వివరించారు. అటు ఇరాన్ అమెరికాదే తప్పంటూ ఆరోపించింది. అమెరికా తన స్వప్రయోజనాల కోసమే సైన్యాన్ని మోహరించిందని దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నాసెర్ కనానీ స్పష్టం చేశారు.













