తండోపతండాలుగా వలసలు
మెక్సికో శరణార్థులతో అమెరికా ఉక్కిరిబిక్కిరి
వాషింగ్టన్ః గత 20 ఏళ్ల కాలంలో కనీ వినీ ఎరుగనంతగా అమెరికాకు వలసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నైరుతి దిశ నుంచి అమెరికాకు శరణార్థులుగా వస్తున్న వారి సంఖ్యకు లెక్కాపత్రం ఉండడం లేదు. అమెరికా దేశీయ భద్రతా వ్యవహారాల శాఖ (హోమ్‌లాండ్ సెక్యూరిటీ) అందించిన సమాచారం ప్రకారం మెక్సికో సరిహద్దుల నుంచి తమ దేశంలోకి ప్రవేశిస్తున్న పిల్లలు, యువతీ యువకుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది.
గత ఏడాది ఏప్రిల్ నుంచి మెక్సికో, సెంట్రల్ అమెరికాల నుంచి వలస వస్తున్న శరణార్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఒంటరి వయోజనుల్ని, కుటుంబాల్ని రానివ్వడం లేదని, కేవలం పిల్లలను, యువతను మాత్రమే రానిస్తున్నామని, అయినప్పటికీ ఈ సంఖ్యకు అడ్డూ ఆపూ ఉండడం లేదని హోమ్‌లాండ్ సెక్యూరిటీ మంత్రి అలెజాండ్రో మెయొర్కాస్ తెలియజేశారు.
మెక్సికో, ఉత్తర త్రికోణం (గ్వాటెమేలా, హోండురాస్, ఎల్ సాల్వెడార్)లలో అవినీతి, హింసాకాండ, పేదరికం వంటి జాడ్యాలు పెరిగిపోతుండడంతో నాణ్యమైన జీవితం కోసం అక్కడి ప్రజలు అమెరికాకు వలస రావడం ఎక్కువైందని, ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉందని ఆయన వివరించారు. అయితే, ఇంత భారీగా వలస రావడం మాత్రం అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని మెయొర్కాస్ వ్యాఖ్యానించారు.
ఆ దేశాలలో పరిస్థితి రాను రానూ క్షీణిస్తోందని, ఇటీవల సంభవించిన రెండు తుఫాన్ లతో జీవన స్థితిగతులు మరింత దిగజారాయని అంటూ, కరోనా వైరస్ కారణంగా వలసలు బాగా పెరిగాయని ఆయన తెలిపారు. ‘‘సరిహద్దుల వద్ద ఎక్కువ సంఖ్యలో భద్రతా సిబ్బందిని నియమించాల్సి వస్తోంది. గత 20 ఏళ్ల కాలంలో ఇంతటి జటిల పరిస్థితి ఎన్నడూ ఎదురు కాలేదు’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా సరిహద్దు భద్రతా దళాలు ఒక్క ఫిబ్రవరిలోనే లక్ష మందికి పైగా వయోజనులను వెనక్కి పంపించేయాల్సి వచ్చిందని అమెరికా కస్టమ్స్, సరిహద్దు భద్రతా దళ విభాగం తెలిపింది. 2019 నాటి సరిహద్దు సంక్షోభం తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో శరణార్థులను తిప్పి పంపడం ఇదే మొదటిసారని అది తెలియజేసింది.
మెక్సికో గ్వాటెమేలా, హోండురాస్, ఎల్ సాల్వెడార్ దేశాలు బహిష్కరిస్తున్నవారిలో ఎక్కువ మంది ఒంటరి వయోజనులేనని మెయొర్కాస్ తెలియజేశారు. ఇక ఆ దేశాల నుంచి ఒంటరిగా వస్తున్న పిల్లలలో 6 ఏళ్ల లోపు వారు కూడా ఉన్నారని, తాము అటువంటివారికి ప్రవేశం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. వారిని తాము ఆరోగ్య, మానవ సేవల కేంద్రాలకు, శరణార్థి శిబిరాలకు పంపిస్తున్నామని, వారి కోసం అవసరమైతే అదనపు శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలియజేశారు.
రిపబ్లికన్ పార్టీ విమర్శలు
కాగా, దక్షిణ సరిహద్దుల నుంచి వలస వస్తున్న 18 ఏళ్ల లోపు పిల్లలకు పునరావాసం కల్పించడానికి బైడెన్ ప్రభుత్వం అతి వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇటువంటివారు రోజుకు వందల సంఖ్యలో వలస వస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ‘‘వచ్చే నెల నాటికి మా పునరావాస కేంద్రాలలో పడకలన్నీ నిండిపోతాయి. ఇది మాకు నిజంగా పెద్ద సవాలు. అయినప్పటికీ మేం ఈ శరణార్థులకు పునరావాసం కల్పించడంలో వెనక్కి తగ్గం. మా విధానం కొనసాగుతుంది’’ అని అధ్యక్షుడు బైడెన్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
శరణార్థుల విషయంలో ట్రంప్ తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలను రద్దు చేస్తామని ప్రకటించి బైడెన్ ప్రభుత్వం తేనె తుట్టెను కదల్చిందని కాంగ్రెస్‌లోని రిపబ్లికన్ పార్టీ సభ్యులు విమర్శించారు. ‘‘ఇది జరగకుండా ఉండాల్సింది. బైడెన్ ప్రభుత్వం చేజేతులా కొని తెచ్చుకుంది’’ అని ప్రతినిధుల మహాసభలో రిపబ్లికన్ పార్టీ నాయకుడు కెవిన్ మెక్‌కార్తీ వ్యాఖ్యానించారు.
ఒక్క ఆదివారం నాడే సుమారు 4,300 మంది ఒంటరి పిల్లలు అమెరికాలోకి ప్రవేశించినట్టు అధికారులు తెలిపారు. వారిని 72 గంటల లోగా శరణార్థి కేంద్రాలకు తరలించాల్సి ఉంటుందని వారు తెలియజేశారు. టెక్సాస్, అరిజోనాలలో పిల్లల కోసం భారీ సంఖ్యలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు, తాము వెనక్కి పంపిస్తున్న వయోజనులను తిరిగి తీసుకోవాల్సిందిగా మెక్సికో, తదితర దేశాలపై ఒత్తిడి తీసుకు రావడం కూడా జరుగుతోంది.













