వ్యాక్సిన్ తప్పనిసరి కాదు… నెగిటివ్ రిపోర్ట్

వ్యాక్సినేషన్ విషయంలో తమ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని, జూన్ 14 నుంచి యూఎస్ వీసా అపాయింట్‍మెంట్లు యథాతథంగా ఉంటాయని మినిస్టర్ కౌన్సెలర్ ఫర్ కాన్సులర్ ఎఫైర్స్ డాన్ హెప్లిన్ సృష్టం చేశారు. అమెరికాలో అడుగుపెట్టేందుకు వ్యాక్సినేషన్ అర్హత కానే కాదన్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడతున్న వేళ అమెరికాలో అడ్మిషన్లు పొందిన విద్యార్థుల కోసం అమెరికా ఎంబసీ ప్రకటన చేసింది.
టీకాకు సంబంధించి అమెరికా ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని, ప్రయాణానికి మూడు రోజుల ముందు కరోనా నిర్ధారణ పరీక్షలో నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి అని ఎంబసీ తెలిపింది.
వ్యాక్సినేషన్ కోసం సంబంధిత యూనివర్సిటీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కొన్ని వర్సిటీలు మాత్రం వ్యాక్సిన్ తప్పనిసరి చెబుతున్నందున, దీనిపై ఆ వర్సిటీ అధికారులను సంప్రదించాల్సి ఉంటుందని చెప్పింది. ఇండియన్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. స్థానిక టీకా తప్పనిసరిగా వేసుకోవాలని సూచించిన వర్సిటీలోనే వేయించుకుంటే ఉత్తమమని అభిప్రాయపడింది. జూన్ 14 తరువాత ఉన్న అపాయింట్‍మెంట్లు యథావిధిగా కొనసాగుతాయని, అంతకంటే ముందు దరఖాస్తు చేసుకుని రద్దయిన వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది.