లాస్ ఏంజెలెస్‌లో ప్రమాదం.. విషాదంలో ఎన్నారై కుటుంబం
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎన్నారై కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు చనిపోగా తీవ్రంగా గాయపడిన తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం బండ్లగూడెం గ్రామానికి చెందిన చెట్టిపెల్లి రామచంద్ర రెడ్డి 20 ఏళ్ల కిందట అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. లాస్ఏంజెలెస్లో నివాసం ఉంటున్నారు. డిసెంబరు 18వ తేదీ న స్థానికంగా జరిగిన ఫ్యామిలీ గెట్ టూ గెదర్ పార్టీలో పాల్గొన్ని తిరిగి ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆర్జిత్ రెడ్డి ఘటన స్థలిలోనే చనిపోగా అక్షర రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత చనిపోయారు. రామచంద్రరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని సన్నిహితులు తెలిపారు. ఆటలు, చదువులో ముందుండే ఆర్జిత్, అక్షరల మృతి పట్ల అమెరికన్ ఎన్నారైలు సంతాపం వ్యక్తం చేశారు. డిసెంబరు 25న స్థానికంగా ఉన్న తెలుగు వారు క్యాండిల్‌లైట్ విజిల్ కార్యక్రమం చేపట్టారు.













