గ్లోబల్ టాస్క్ ఫోర్స్ కమిటీలో… భారతీయ అమెరికన్ సీఈఓలు

కరోనాతో పోరాడుతున్న భారత్‍కు అగ్రరాజ్యం అమెరికా భారీ సాయం చేస్తోంది. భారత్‍కు సాయం చేసేందుకు అమెరికాలోని 40కి పైగా సంస్థలు ముందుకొచ్చాయి. దీనికోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అమెరికా ఏర్పాటు చేసిన ‘గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఆన్ పాండమిక్ రెస్పాన్స్’ స్టీరింగ్ కమిటీలో ముగ్గరు భారత సంతతి ప్రముఖులకు చోటు దక్కింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, డెలాయిట్ సీఈఓ పునిత్ రెంజన్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. ఈ చర్య కోవిడ్‍పై భారత్ విజయవంతంగా పోరాటానికి సహాయపడేందుకు కార్పొరేట్ సంస్థలు దోహదం చేస్తాయని పలువురు భావిస్తున్నారు.
ఇప్పటికే ఈ కమిటీలో బిల్-మిలిందా గేట్స్ ఫౌండేషన్ సీఈఓ మార్క్ సుజ్మన్, బిజినెస్ రౌండ్‍టేబుల్ అధ్యక్షుడు, సీఈఓ జాషువా బోల్టెన్, యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, సీఈఓ సుజనా క్లార్క్, యాపిల్ సీఈఓ టీమ్ కుక్, ఫెడెక్స్ ప్రెసిడెంట్ రాజ్ సుబ్రమణ్యం వంటి ప్రముఖులు ఉన్నారు. గ్లోబల్ టాస్క్ ఫోర్స్ను యుఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇటీవల ప్రభుత్వ- ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కరోనాను కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు యుఎస్ భారత్ బిజినెస్ కౌన్సిల్, యుఎస్-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్స్తో కలిసి పనిచేయనుంది.