రాజపక్స కుటుంబానికి బిగ్ షాక్…
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స సోదరులు, మాజీ ప్రధాన మంత్రి మహింద రాజపక్స, మాజీ మంత్రి బసిల్ రాజపక్స దేశం విడిచి వెళ్ళరాదని శ్రీలంక సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్థికంగా లంకను దిగజార్చి తీవ్ర సంక్షోభంతో ప్రజానిరసనలతో అట్టుడికిపోయేలా చేసిన రాజపక్స కుటుంబానికి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే రాజపక్స సోదరుడు, మాజీ అధ్యక్షుడు గోటబయ్య రాజపక్స రాజీనామా భయంతో దేశం విడిచిపారిపోయాడు. ఆపై సింగపూర్ చేరుకున్నాక అక్కడి నుంచి స్పీకర్‌కు రాజీనామా లేఖ పంపారు. దీంతో లంక ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. చీఫ్ జస్టిస్ జయనాథ జయసూర్య దగ్గరుండి మరీ ప్రమాణం చేయించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు గనుక రాజీనామా చేస్తే ప్రధాని పదవిలో ఉన్నవాళ్లు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. గొటబయ రాజపక్స దేశాధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను ఆమోదించినట్లు పార్లమెంటు స్పీకర్ మహింద యాప అబేయవర్ధన ప్రకటించారు.













