ఎలోన్ మస్క్ సహనాన్ని పరీక్షిస్తున్న స్పేస్ ఎక్స్!
భూమిపై మనం ఒక ఊరి నుంచి మరో ఊరికి ఎలా వెళ్తున్నామో.. అంతరిక్షానికి కూడా అలా రాకపోకలు సాగించాలనేది ఎలోన్ మస్క్ కల. దాన్ని సాకారం చేసేందుకు ఆయన ఎంతో శ్రమిస్తున్నారు. వరుసగా ప్రయోగాలు చేస్తున్నారు. వైఫల్యాలు ఎదురవుతున్నా.. ఆయన ఏమాత్రం తగ్గట్లేదు. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఇవాళ నిర్వహించిన SN 10 స్టార్ షిప్ కూడా అనుకున్నస్థాయిలో విజయం సాధించలేదు. అయితే గతంలో నిర్వహించిన రెండు పరీక్షలతో పోల్చితే ఇది కాస్త మెరుగైన పనితీరు కనబర్చింది. అదొక్కటే ఆశావహ పరిణామం. టెక్సాస్ లోని బోకా చికా లాంచ్ పాడ్ నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5.15కు ఈ ప్రయోగం జరిగింది. ప్రయోగమంతా సాఫీగానే సాగింది. స్పేస్ ఎక్స్ రాకెట్ సుమారు 6 మైళ్ల దూరం ప్రయాణించింది. ఆ తర్వాత తిరుగుపయనమైంది.
తిరుగుపయనం కూడా సాఫీగానే సాగింది. అనుకున్నవిధంగానే నేలపై సురక్షితంగానే దిగింది. అంతా ఓకే అని భావించారు. అయితే కాసేపటికే అది పేలిపోయింది. బహుశా.. సేఫ్ ల్యాండింగ్ తర్వాత ఇంధనానికి మంటలు అంటుకోవడంతోనే ఇది పేలి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
అంతకుముందు గతేడాది డిసెంబర్ 9న తొలి స్పేస్ ఎక్స్ రాకెట్ ను ప్రయోగించారు. అది నేలపై దిగకముందే పేలిపోయింది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 2న రెండో ప్రయోగం చేపట్టారు. ఇది కాస్త ఫర్వాలేదు. దిగుతున్న సమయంలో గట్టిగా నేలను తాకింది. దీంతో అది పేలిపోయింది. ఇవాళ జరిగిన మూడో ప్రయోగంలో సేఫ్ గా ల్యాండ్ అయిన కాసేపటి తర్వాత రాకెట్ పేలిపోయింది. సో.. ప్రతి ప్రయోగంలోనూ కాస్త పురోగతి సాధిస్తున్నారు ఎలోన్ మస్క్.
స్పేస్ ఎక్స్ ద్వారా రాకెట్లను చంద్రుడిపైకి, అంగారకుడిపైకి పంపించాలనేది ఎలోన్ మస్క్ లక్ష్యం. వీటి ద్వారా 12 మంది ఆస్ట్రోనాట్లను స్పేస్ లోకి పంపించి.. వారిని తిరిగి భూమికి తీసుకురావాలనేది ఆయన టార్గెట్. 2023 నాటికి దీన్ని ఆచరణలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. పునరుపయోగించగలిగే రాకెట్లను రూపొందించడం ద్వారా ఖర్చు భారీగా తగ్గడంతో పాటు.. మరింతమందికి స్పేస్ టూరిజం అందుబాటులోకి తీసుకురావచ్చు. ఇదే ఎలోన్ మస్క్ లక్ష్యం. ఇది సక్సెస్ అయితే సాధారణ ప్రజలను కూడా స్పేస్ లోకి తీసుకెళ్లి.. తిరిగి తీసుకురావచ్చు. ప్రస్తుతానికి 12 మందితో కూడిన రాకెట్లను సక్సెస్ ఫుల్ గా తయారుచేయడమే మస్క్ లక్ష్యం. అయితే ఇది సక్సెస్ అయితే 100 మందితో కూడిన రాకెట్లను కూడా తర్వాత స్టేజ్ లో తయారు చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఆయన పట్టుదల, ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం.













