కిమ్ కు దక్షిణ కొరియా ప్రతిపాదన.. వాటిని విడనాడితే
ఉత్తర కొరియా అణ్వస్త్ర కార్యక్రమానికి స్వస్తి చెబితే పెద్దఎత్తున ఆర్థిక సహకారం అందిస్తామని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూఎన్ సుక్ యోల్ ప్రతిపాదించారు. ఉత్తర కొరియా అణ్వస్త్రాలను విడనాడితే ఆసియా తోపాటు యూవత్ ప్రపంచంలో శాంతి స్థాపన సుగమం అవుతుందన్నారు. కొరియా ద్వీపకల్పంలో జపాన్ వలస పాలన అంతమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ యూన్ ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ఉత్తర కొరియా అణు, క్షిపణి పరీక్షలను విడనాడితే తీవ్ర కరవును అధిగమించడానికి ఆహారం అందిస్తామని, విద్యుత్తు, రేవులు, విమానాశ్రయ ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందిస్తామని, వ్యాపార సంబంధాలను వృద్ధి చేసుకుంటామని యూన్ ప్రతిపాదించారు. వ్యవసాయ, వైద్య రంగాలను ఆధునికీకరిస్తామని, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి తోడ్పడతామని తెలిపారు.













