వారు లేకపోతే నేను లేను : సల్మాన్ రష్దీ
అంతర్జాతీయ రచయిత సల్మాన్ రష్దీ (75) మళ్లీ జనం మధ్యకు వచ్చారు. గతేడాది ఆగస్టు 12న న్యూయార్క్‌లో సాహితీ కార్యక్రమ వేదికపై మాట్లాడుతున్న ఆయనపై ఓల్డ్ న్యూజెర్సీకి చెందిన ఓ యువకుడు (24) కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ దాడి కారణంగా రష్దీకి ఒక కంటి చూపు పోయింది. బుకర్ ప్రైజ్ విజేత అయిన రష్దీ న్యూయార్క్ నగరంలోని మాన్‌హట్టన్‌లో గల అమెరికన్ మ్యూజియం అఫ్ నేచురల్ హిస్టరీలో జరిగిన 2023 లిటరరీ గాలాకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెన్ సెంటినరీ కరేజ్ అవార్డుతో ఆయనను సత్కరించారు. పెన్ అమెరికా సంఘానికి పూర్వం అధ్యక్షుడిగా పని చేసిన రష్దీ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మళ్లీ మీ ముందుకు రావడం ఆనందంగా ఉంది. ఉగ్రవాదం, హింస మనల్ని భయపెట్టలేవు. పోరాటం కొనసాగుతుంది. నాపై దాడి జరిగినపుడు పరుగున వేదిక మీదకు వచ్చి ఆ దుండగుణ్ని ఎదుర్కొన్న హీరోల తరపున ఈ అవార్డును స్వీకరిస్తున్నా. వారు లేకపోతే నేను లేను. ఆ హీరోలకు జీవితాంతం రుణపడి ఉంటా అని అన్నారు.













