అమెరికా ఆరోపణలు.. ఖండించిన రష్యా
అంతరిక్షంలో ఉపగ్రహ విధ్వంసక ఆయుధాన్ని రష్యా అభివృద్ది చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని అమెరికా ప్రకటించింది. ఇది తీవ్ర ఆందోళనకర అంశమని పేర్కొంది. ఆ ఆయుధాన్ని రష్యా ఇంకా మోహరించలేదని, ప్రస్తుతానికైతే ఎలాంటి ముప్పులేదని తెలిపింది. అమెరికా ఆరోపణలను రష్యా తోసిపుచ్చింది. ఉక్రెయిన్‌కు సాయంపై అమెరికా కాంగ్రెస్ మద్దతు పొందేందుకు బైడెన్ సర్కారు ఈ కొత్త ఎత్తు వేసినట్లు ఆరోపించింది. రష్యా రహస్యంగా ఓ కీలక ఆయుధాన్ని అభివృద్ది చేస్తున్నట్లు సమచారం అమెరికా నిఘా విభాగం వద్ద ఉందని ఇటవల వార్తలు వచ్చాయి. దీనిపై నిజాలను బయటపెట్టాలని అధ్యక్షుడు బైడెన్ యంత్రాంగాన్ని ప్రతినిధుల సభ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్ మైక్ టర్నర్ ఇటీవల డిమాండ్ చేశారు.దాని పర్యవసానాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆ వార్తల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు శ్వేతసౌధం తాజాగా ధ్రువీకరించింది.













