తప్పు మీదే అంటే … కాదు మీదే
నల్లసముద్రంలో అమెరికా నిఘా డ్రోన్ కూల్చివేత ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. తప్పు మీదే అంటే కాదు మీదే అంటూ అమెరికా, రష్యాలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి. దీన్ని కవ్వింపు చర్యగా మాస్కో అభివర్ణించింది. అగ్రరాజ్యాం మాత్రం అమెరికా ఆస్తులకు దగ్గరగా ఎగురుతున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. నల్లసముద్రంలో ఎగురుతున్న అమెరికా ఎంక్యూ`9 నిఘా డ్రోన్ మార్గంలో రష్యాకు చెందిన రెండు ఎస్‌యూ`27 జెట్ విమానాలు ఇంధనం చల్లాయని, తర్వాత అవి నేరుగా ప్రొఫెల్లర్‌ను ఢీకొన్నాయని, దీంతో తమ డ్రోన్ కూలిందని అమెరికా ఆరోపించింది. డ్రోనే తమ జెట్లను తాకి కుప్పకూలిందంటూ ఆ ఆరోపణలను రష్యా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో యూఎస్‌లోని రష్యా రాయబారి అనతోలి ఆంటనోవ్ను అమెరికా పిలిపించుకుంది. తమ దేశ ఆస్తులకు సమీప గగనతలంలో ఎగురుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సమావేశానంతరం బయటికి వచ్చిన ఆంటనోవ్ అమెరికాయే కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. తమ జలాల్లోకి ఎవరు చొరబడినా తిప్పికొడతామని చెప్పారు.













