భారత్ శాశ్వత సభ్యత్వ అభ్యర్థిత్వానికి.. రష్యా మద్దతు
భారత్, రష్యా సంబంధాలు చాలా బలంగా, స్థిరంగా ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. ఇరు దేశాలది ఉభయ ప్రయోజనకర బంధమని పేర్కొన్నారు. రష్యాలో అయిదు రోజుల పర్యటనలో భాగంగా ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్తో జైశంకర్ బేటీ అయ్యారు. ఆర్థిక, ఇంధన, సాంకేతిక, అనుసంధానత సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవడంపై వారు సమాలోచనలు జరిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతం, ఉక్రెయిన్ యుద్ధం, గాజా పరిస్థితి సహా పలు సమకాలీన అంతర్జాతీయ అంశాలపైనా చర్చించారు. అనంతరం జైశంకర్, లవ్రోవ్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎప్పటికప్పుడు పరస్పరం సంప్రదింపులు జరుపుకొంటూనే ఉన్నారని తెలిపారు. వచ్చే ఏడాది ఇరు దేశాల వార్షిక శిఖరాగ్ర సదస్సులో వారు పాల్గొంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ అభ్యర్థిత్వానికి రష్యా మద్దతు పలుకుతున్నట్లు సెర్గీ లవ్రోవ్ ప్రకటించారు. ఈ ఏడాది జీ`20 శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా జరగడంపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. భారత దౌత్య విధానాలకు దక్కిన నిజమైన గెలుపుగా ఆ సదస్సును అభివర్ణించారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇండియాలో అత్యాధునిక ఆయుధాల ఉత్పత్తిని ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు లవ్రోవ్ తెలిపారు.













