ఐఫోన్ వాడకాన్ని నిషేధించిన రష్యా.. ఎందుకో తెలుసా?
ఐఫోన్ వాడాలంటే రష్యా ప్రభుత్వం జంకుతోంది. వేలమంది అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు వాటిని వాడవద్దని హెచ్చరిస్తోంది. యాపిల్ అమెరికాకు చెందిన సంస్థ కావడం, దీంతో అక్కడి కంపెనీలు తమపై గూఢచర్యానికి పాల్పడుతున్నాయనే ఆందోళనలు పెరగడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తమ అధికారులకు ఇదివరకే ఈ మేరకు ఆదేశాలు జారీ చేయగా, తాజాగా అక్కడి వాణిజ్యశాఖ కూడా ఐఫోన్లను వాడవద్దని ఉద్యోగులను ఆదేశించింది. ఐఫోన్లు, ఐపాడ్‌తో పాటు యాపిల్ సంస్థకు చెందిన ఇతర ఉత్పత్తుల వాడకంపై రష్యా ప్రభుత్వశాఖలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. తమ సంస్థలపై అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గూఢచర్యానికి పాల్పడే ఘటనలు పెరుగుతున్నాయని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌తో పాటు అక్కడి ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఐఫోన్లను వినియోగించవద్దని, వాటికి ప్రత్యామ్నాయ ఫోన్లను వినియోగించాలంటూ వివిధ మంత్రిత్వశాఖల్లోని డిప్యూటీ మంత్రులు, ఉన్నతోద్యోగులు మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా వాణిజ్య శాఖ కూడా అధికార పనుల కోసం ఐఫోన్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొంది.













