చైనాతో మాకు విభేదాలున్నాయి… కానీ : జో బైడెన్
పారదర్శకమైన ఆర్థిక సంబంధాల విషయంలో బీజింగ్-వాషింగ్టన్ మధ్య విభేదాలున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ సీఈవో సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా-చైనా మధ్య పోటీలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నేను భావిస్తున్నాను. ప్రపంచం మా నుంచి ఆశిస్తున్నదే నేను చేస్తున్నానని హామీ ఇస్తున్నాను. ఎలాంటి కమ్యూనికేషన్ లోపాలు ఉండకూడదనే ఉద్దేశంతో నేను నిన్న జిన్‌పింగ్‌తో భేటీ అయ్యాను. నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచే ఏ దేశాధినేతతతో సమావేశం కానన్ని సార్లు జిన్‌పింగ్‌తో భేటీలు నిర్వహించాను అని అన్నారు.
తాజాగా భేటీకి ముందు దాదాపు 68 గంటల పాటు ప్రైవేటు సమావేశాలు జరిగాయి. నేను సంక్షోభం కోరుకోవడం లేదని మరోసారి ఆయన వెల్లడిరచారు. ఈ క్రమంలో ఇరు దేశాల సైన్యాల మధ్య కమ్యూనికేషన్‌ను పునరుద్ధరించాం. ఇక పారదర్శక ఆర్థిక విధానలు, సమాన అవకాశాలున్న ఆర్థిక వేదికలు, మేధో సంపత్తి హక్కుల విషయంలో చైనాతో మాకు విభేదాలున్నాయి. బలమైన దౌత్యమార్గాలతో పాటు తెలివైన విధానాలతో వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నాం అని పేర్కొన్నారు.













