ఆస్ట్రేలియా లో పీవీ విగ్రహావిష్కరణ
మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు విగ్రహాన్ని ఈ నెల 22న ఆస్ట్రేలియాలోని స్ట్రాత్ఫిల్డ్ టౌన్ హాల్లో ఆవిష్కరించనున్నట్టు టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్, పీవీఎన్ఆర్ సెలబ్రేషన్స్ కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల ఒక ప్రకటనలో తెలిపారు. స్ట్రాత్ఫిల్డ్ కౌన్సిల్ మేయర్ మాథ్యూ బ్లాక్మేర్, కౌన్సిలర్ సంధ్యారెడ్డి ఇందుకు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాల చైర్మన్, ఎంపీ కే కేశవరావు పీవీ కుటుంబ సభ్యులకు ఈ మేరకు ఆహ్వానం అందించినట్టు తెలిపారు. భారత మాజీ ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన సేవలు, ఆయన జీవితం గురించి అధ్యయనం చేసేందుకు ఇతర దేశాల స్కాలర్స్ కూడా వస్తున్నారని పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు తెలిపారు. ఆస్ట్రేలియాలో పీవీ విగ్రహా ప్రతిష్ఠాపనకు సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.













