రష్యా అధ్యక్షుడు శుభవార్త… ఉద్యోగులకు
ఉక్రెయిన్పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధ నేపథ్యంలో మాస్కోపై అంతర్జాతీయంగా పలు దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించినా, రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉద్యోగులకు వరాలు ప్రకటించారు. ఉద్యోగుల కనీస వేతనాలు, పింఛన్లను 10 శాతం మేర పెంచారు. వేతనాల పెంపు జూన్ 1 నుంచి, ఫించన్ల పెంపు జులై 1 నుంచి అమలులోకి వస్తాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో రష్యాలో ఉద్యోగుల నెలవారీ కనీస వేతనం రూ.19,383 (250 డాలర్లు), సగటు పింఛను రూ.24,811 (320 డాలర్లు) కానుంది. ఈ మేరకు ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ రష్యా పౌరుల జీవన ప్రమాణాలు పెంచడానికి, వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం అని తెలిపారు. విదేశాల్లో రష్యన్ మిలటరీ ఆపరేషన్లలో పాల్గొంటున్న సైనికులకు వేతనాలు పెంచే అంశాన్ని సైతం పరిశీలించాలని పుతిన్ అధికారులను ఆదేశించారు.













