130 సంవత్సరాల తర్వాత.. ఇదే మొదటిసారి
ఫోన్ హ్యాకింగ్ కేసులో సాక్ష్యం చెప్పేందుకు బ్రిటన్ రాజకుమారుడు, రాజు చార్లెస్-3 రెండో కుమారుడు హ్యారీ (38) లండన్ హైకోర్టుకు హాజరయ్యారు. విట్నెస్ బాక్స్‌లో నిలబడి సాక్ష్యం చెప్పారు. బ్రిటన్ రాజకుటుంబ సభ్యుడు ఇలా కోర్టుకు హాజరుకావడం దాదాపు 130 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. మిర్రర్ గ్రూప్ న్యూస్ పేపర్ (ఎంజీఎన్) మీడియా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఫోన్ హ్యాకింగ్‌తో పాటు చట్టవ్యతిరేక పద్ధతుల్లో ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. మిర్రర్ గ్రూప్ నిర్వాకంపై ప్రిన్స్ హ్యారీతో పాటు వంద మందికి పైగా ప్రముఖులు ఫిర్యాదు చేయడం తో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే హ్యారీ కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు. మిర్రర్ గ్రూప్ వల్ల తన జీవితం తీవ్రంగా ప్రభావితమైందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనను ఒక మోసగాడిగా, తాగుబోతుగా, డ్రగ్స్ తీసుకొనే చిల్లర వ్యక్తిగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించారని పేర్కొన్నారు.













