50 ఏళ్ల తర్వాత …కాళీమాత ఆలయాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి కోవింద్
పాకిస్తానీ సైనిక దళాలు 1971లో ధ్వంసం చేసిన చారిత్రాత్మక శ్రీరమణ కాళీ మందిరాన్ని 50 ఏళ్ల తర్వాత భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. బంగ్లాదేశ్ విముక్తి స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎం అబ్దుల్ హమీద్ ఆహ్వానం మేరకు మొదటిసారి ఇక్కడకు వచ్చిన రామ్‌నాథ్ కోవింద్ పునర్నిర్మించిన కాళీమాత మందిరాన్ని సతీసమేతంగా సందర్శించి పూజలు నిర్వహించారు. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణచివేసేందుకు ఆపరేషన్ సెర్చ్‌లైట్ పేరిట పాకిస్థాన్ సైన్యంలో చేపట్టిన చర్యలలో భాగంగా కాళీమాత ఆలయాన్ని ధ్వసంచేసింది. పాకిస్థానీ సైనిక దళాలు ఆలయానికి నిప్పు పెట్టడంతో భక్తులు, అందులో నివసించే వారితో సహా అనేక మంది మరణించారు. ఆలయ పునర్మిర్మాణానికి భారత్ సహకరించింది. ముస్లింలు అధికంగా ఉండే బంగ్లాదేశ్ మొత్తం జనాభా 16.90 కోట్లలో దాదాపు 10 శాతం మంది హిందువులు ఉన్నారు.













