అమెరికాలో టోర్నడో బీభత్సం
అగ్రరాజ్యం అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. అసలే శీతాకాలం, అందులోనూ బలమైన ఈదురు గాలులు, మంచు తుపానులు ప్రమాదకరమైన రీతిలో విరుచుకుపడుతుండడంతో ప్రజలు గజగజలాడుతున్నారు. తుపాను కారణంగా విద్యుత్ తీగలు తెగిపడడంతో అంతటా అంధకారం అలముకుంది. చెట్లు నేలకొరిగాయి. కూలిన చెట్లు, మంచుతో రహదారులు ప్రమాదకరంగా మారాయి. జార్జియా, నార్త్ కరోలినా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడ్లాలో లక్షలాదిమంది ప్రజలు అంధకారంలో చిక్కుకున్నారు. వందలాది వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి.
ఫ్లోరిడాలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 120కి పైగా విమానాలు రద్దయ్యాయి. నార్త్ కరోలినాలోని పశ్చిమ ప్రాంతంలో కొన్ని చోట్ల పది అంగుళాల మందాన మంచు పేరుకుపోయింది. దాదాపు 300 కార్లు క్రాష్ అయ్యాయని హైవే గస్తీ బృందం ప్రతినిధి తెలిపారు. కార్ల సర్వీస్ కోసం దాదాపు 800 కాల్స్ వచ్చాయన్నారు. రాలేగ్లో కారు దూసుకెళ్ళి చెట్లను ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. ఇప్పటికీ లక్షా 30 వేల మంది చీకట్లోనే వున్నారు. దాదాపు 90 వేల ఇళ్ళకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫ్లోరిడాకు వాయవ్య ప్రాంతాల్లో గంటకు 190 కిలోమీటర్ల వేగంతో గాలులు భయంకరంగా వీస్తున్నాయని జాతీయ వాతావరణ విభాగం తెలిపింది.













